కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 19 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: అష్టమి మ.1.59 కు తదుపరి నవమి 20 సా.4.02 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: మూల రా.1.29 కు తదుపరి పూర్వాషాఢ 21 తె.4.04 కు
యోగం: ఆయుష్మాన్ మ.2:28 కు తదుపరి సౌభాగ్య 20 మ.3:22 కు
కరణం: బవ మ.3:27 కు, బాలవ 20 తె.4.40 కు తదుపరి కౌలవ 20 సా.5:52 కు
రాహుకాలం: ఉ. 09.00 – 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.44 – 8.33 కు
వర్జ్యం: ఉ.7.46 – 9.32 కు, రా.11.43 – 1.29 కు
అమృతకాలం: సా. 06.36 – 08.24 కు
సూర్యోదయం: ఉ. 6.08 కు
సూర్యాస్తమయం: సా. 6.11 కు
🕉️ భాద్రపద శుక్ల అష్టమి – రాధాష్టమి, దూర్వాష్టమి, శ్రీ భువనేశ్వరీదేవి జన్మతిథి (దశమహావిద్యలలో 4వ మహావిద్య) 🕉️
గురుబోధ:
🕉️శ్లో. ఏకాదశ్యా సహస్రేణ యత్ఫలం లభతే నరః | రాధాజన్మాష్టమీ పుణ్యం తస్మాత్ శత గుణాధికమ్ || శ్రీ పద్మపురాణం, బ్రహ్మఖండం
ఫలశ్రుతి: ఏకాదశీ వ్రతమున కంటే కూడా గొప్ప ఫలమిచ్చే అపూర్వ వ్రతము, భాద్రపద శుక్లపక్ష అష్టమి నాడు చేసే రాధాష్టమీ వ్రతము. 1000 ఏకాదశీ వ్రతముల ఫలానికి నూరురెట్లు – అంటే లక్ష ఏకాదశీ వ్రతములు ఆచరించినంత పుణ్యఫలాన్ని – ఒక్కసారి రాధాష్టమీ వ్రతాన్ని భక్తితో ఆచరించడం ద్వారా పొందవచ్చని పద్మపురాణంలోని ఈ వ్రతమహిమ చెపుతోంది. అందుకే శ్రీరాధాదేవి అనుగ్రహాన్ని ప్రసాదించే రాధాష్టమీ వ్రతం అత్యంత విశిష్టమైనది, మహిమాన్వితమైనది. రాధాష్టమీ వ్రతము ఆచరించే వారి ఇంట కరవు కాటకములు ఉండవు. అన్యోన్య దాంపత్యాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించే అపూర్వ వ్రతమిది.
🕉️రాధాష్టమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి గురుధ్యానం చేసుకుని, శిరఃస్నానం ఆచరించి, యథాశక్తిగా ఇష్టదేవతాపూజ చేసుకోవాలి. తరువాత శ్రీ రాధాకృష్ణులను భక్తిశ్రద్ధలతో పూజించాలి. తులసీదళాలతో రాధాకృష్ణులిద్దరినీ అర్చించాలి. శ్రీ రాధాదేవి అష్టోత్తర శతనామావళి, శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి లేదా శ్రీకృష్ణ సహస్రనామాలతో రాధాకృష్ణులను పూజించవచ్చు. తులసీదళాలతో పాటు పుష్పాలను కూడా సమర్పించవచ్చు. పూజ అనంతరం శ్రీ రాధాకృష్ణులకు వెన్నను, పాయసాన్నాన్ని సమర్పించాలి.
🕉️రాధాష్టమీ వ్రతంలో దానానికి కూడా విశేష ప్రాధాన్యం ఉంది. ఆ రోజున ఉప్పు, కొన్ని కూరగాయలు, పెరుగు, వెన్న మొదలైన పదార్థాలను స్వయంపాకంలో ఉంచి దానం చేయాలి. ముఖ్యంగా లవణదానం చాలా గొప్పది. ఉప్పును నేరుగా చేతితో ఇవ్వకూడదు. అందువల్ల ఒక ఆకులో దానం చేయవలసిన పదార్థాలన్నింటినీ ఉంచి, దానిని ఒక వైపు మనం పట్టుకుని, మరొక వైపు స్వీకరించేవారిని పట్టుకోమని చెప్పాలి. అప్పుడు, “ఈ స్వయంపాకాన్ని లవణంతో సహితంగా మీకు దానం చేస్తున్నాను. స్వీకరించండి” అని చెప్పి దానం చేయాలి.
🕉️రాధామాధవులు నిరంతరం ప్రకృతి ప్రేమికులై గోలోకంలో తిరుగుతూ ఉంటారు. రాధని తలుచుకున్నటువంటి వాళ్ళు బాధా విముక్తులౌతారు. ” శ్రీ రాధాయైనమః ” అనే ఒక మంత్రం ఉన్నది. ఇది రాధాదేవికి బాగా ఇష్టమైన మంత్రం. రాధా ప్రియా, రాధా వల్లభా, రాధా మాధవా అని రాధతో కలిపి కృష్ణుడ్ని పిలిస్తే ఆయన ఎక్కువ సంతోషిస్తాడు.