Details వివరాలు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పూజ్య గురువులకు జయము జయము
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాగణపతయేనమః
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
🌹ప్రణవపీఠాధిపతి పూజ్యగురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి కటాక్షంతో🌹
చార్ ధామ్ సంపూర్ణ యాత్ర (11రా/10ప) 16-5-2022 నుండి 26-5-2022 వరకు హరిద్వార్ నుండి హరిద్వార్ వరకు
ముఖ్య గమనిక :- భాగవతులు మీ ఇళ్ల దగ్గరి నుండి హరిద్వార్ వరకు మరియు తిరుగు ప్రయాణంలో హరిద్వార్ నుండి మీ ఇళ్ల వరకు ప్రయాణసౌకర్యం ఎవరికి వారు చేరుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. 15-5-2022 రాత్రికి హరిద్వార్ చేరుకోవాలి. మన చార్ధామ్ యాత్ర 16-5-2022 ఉదయం ప్రారంభమవుతుంది అని గమనించగలరు
హరిద్వార్ (1రా) - బార్కోట్ (2రా) - ఉత్తరకాశీ (2రా) - గుప్తకాశీ (3రా) - పిపలకోటి (1రా) - బద్రినాథ్ (2రా)
మొదటి రోజు 16-5-2022 ( ఉ.5:00||గంలకు )
హరిద్వార్-బార్కోట్ (230 కి.మీ./7-8 గం.) ఎత్తు: 1,352 మీ.
హరిద్వార్ నుండి చార్ ధామ్ యాత్ర కోసం బార్కోట్ కు ముస్సోరీ కెంప్టీ ఫాల్ గుండా ప్రయాణ ప్రారంభం. బార్కోట్ చేరుకున్నాక హోటల్లో దిగడం, రాత్రి భోజనం, విశ్రాంతి (ఆ రాత్రికి అక్కడే బస).
రెండవ రోజు :
బార్కోట్-యమునోత్రి-బార్కోట్ (42 కి.మీ. & 5 కి.మీ.) ట్రెక్ (రాను-పోను)
ఉదయం బయలుదేరి జానకి ఛత్తి, హనుమాన్ ఛత్తి & ఫూల్ ఛత్తి లకు ప్రయాణం. జానకి ఛత్తి చేరుకున్నాక యమునోత్రి వెళ్ళడానికి 6 కి.మీ ట్రెక్. యమునోత్రిలో ఉష్ణకుండం లో పవిత్రస్నానం, పూజ, శ్రీ యమునోత్రీమాత దర్శనం. దర్శనానంతరం మధ్యాహ్నం తిరిగి జానకి ఛత్తి కు ట్రెక్, అక్కడనుండి బార్కోట్ కు తిరుగు ప్రయాణం. రాత్రి భోజనం, విశ్రాంతి (ఆ రాత్రికి అక్కడే బస).
మూడవ రోజు : బార్కోట్- ఉత్తరకాశీ (120 కి.మీ./5 గం.) ఎత్తు: 1,158 మీ.
ఉత్తరకాశీ ప్రయాణం. విశ్వనాథుని మరియు ఇతర ఆలయాల దర్శనం, హోటల్లో విశ్రాంతి, రాత్రికి అక్కడే బస. ఉత్తరకాశీ - వారుణ, అశి అనే రెండు నదుల మధ్య నెలకొని ఉన్న అందమైన, చిన్న ఊరు. ఈ రెండు నదుల యొక్క నీళ్ళు, ఊరికిరువైపుల నుండి భాగీరథిలో కలుస్తాయి. 1,588 మీ. ఎత్తులో ఉన్న ఈ చిన్న ఊరు, కాశీలాగానే ఉంటుంది, అదే విధంగా ఆలయాలు, ఘాట్లు, ఉత్తర, దక్షిణంగా నది. ఆసక్తి, ఓపిక ఉన్నవారు కాశీవిశ్వనాథుని, ఆదిశక్తిని దర్శించుకోవచ్చు. ఉత్తరకాశీ లో రాత్రికి బస.
నాల్గవ రోజు:
ఉత్తరకాశీ-గంగనాని-గంగోత్రి-హర్శిల్-ఉత్తరకాశీ (150 కి.మీ/6 గం.)
ఉదయం అల్పాహారం తరువాత టీ/కాఫీ తరువాత గంగోత్రి దర్శనానికి ప్రయాణం. తప్త కుండంలో పవిత్ర స్నానం, అలాగే పరమపావన గంగానదిలో కూడ పవిత్ర స్నానం. ఉత్తరకాశీకి తిరుగుప్రయాణం. దారిలో గంగనాని, హర్శిల్ లను దర్శించుకోవడం. రాత్రికి బస ఉత్తరకాశీ లోనే.
అయిదవ రోజు: ఉత్తరకాశీ- గుప్తకాశీ (290 కి.మీ/8-9 గం.)
తెల్లవారుఝామునే అల్పాహారం కట్టుకుని తీసుకువెళ్ళి దాదాపు రోజు మొత్తం ప్రయాణించి గుప్తకాశీకి చేరుకోవడం. దారిలో గంగానది పై తెహ్రీ డ్యాం (హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు) చూడటం. గుప్తకాశీ లో హోటల్లో రాత్రికి బస.
ఆరవ రోజు : గుప్తకాశీ-కేదార్ నాథ్
ఉదయం అల్పాహారం అయ్యాక కేదార్నాథ్ దర్శనానికి హెలికాప్టర్ లో ప్రయాణం, పూజానంతరం రాత్రికి అక్కడే కేదార్నాథ్ లో బస.
సుందరమైన హిమగిరుల శిఖరాగ్రాల మాటున గంభీరంగా 3,584 మీ. ఎత్తున, మందాకినీ తీరాన, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన, ఆ మహాదేవుని పరమపావనమైన కేదార్నాథ్ జ్యోతిర్లింగం కొలువై ఉన్నది. హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం ఇది.
ఏడవ రోజు : కేదార్ నాథ్-గుప్తకాశీ
ఉదయం అల్పాహారం అనంతరం హోటల్ నుండి గుప్తకాశీకి తిరుగు ప్రయాణం. సమయం ఉంటే త్రియుగి నారాయణుని ఆలయం, గుప్తకాశీ విశ్వనాథుని ఆలయం, ఓఖిమఠ్ దర్శనం, గుప్తకాశీలో రాత్రికి బస.
ఎనిమిదవ రోజు :గుప్తకాశీ-బద్రీనాథ్ (235 కి.మీ/6-7 గం.)
ఉదయం అల్పాహారం తరువాత హోటల్ నుండి బద్రీనాథ్ కు దారిలో వచ్చే జోషిమఠ్ గుండా ప్రయాణం. జోషిమఠ్ పరమసుందరమైన ప్రదేశం. ఈ యాత్ర మొత్తంలో అత్యంత రమణీయమైన జోషిమఠ్ గుండా దట్టమైన ఔషధీప్రధానమైన అడవులతో నిండిన అందమైన మార్గం ద్వారా ప్రయాణం. దాదాపు మధ్యాహ్నం ముగుస్తుండగా బద్రీనాథ్ హోటల్ కు చేరుకోవడం. సాయంత్రం ఖాళీ సమయం, రాత్రికి అక్కడే హోటల్లో విశ్రాంతి, బస.
తొమ్మిదవ రోజు
బద్రినాధ్ లో తెల్లవారు ఝామునే భక్తులు తప్తకుండంలో పవిత్రస్నానం, బద్రి విశాల్ దర్శనం. బ్రహ్మకపాలం పితృదేవతలకు పిండప్రదానాలు అర్పించడంలో అతి ప్రాముఖ్యమైన ప్రదేశం. అక్కడ ఇంకా అందమైన మానా, వ్యాస గుహ, మాతామూర్తి, చరణ పాదుకలు, భీమ కుండం మరియు సరస్వతీనది యొక్క ముఖం చూడవచ్చు. బద్రీనాథ్ కు కేవలం 3 కి.మీ దూరంలో అలకనంద, ధౌళిగంగా నదుల సంగమం వద్ద జోషిమఠ్ నెలకొని ఉంది. ఈ మఠం ఆదిశంకరులు స్థాపించిన నాలుగు మఠములలో ఒకటి.
పదవ రోజు : బద్రీనాథ్- శ్రీనగర్ (200 కి.మీ/7 గం.)
ఉదయం అల్పాహారం అయ్యాక హోటల్ నుండి శ్రీనగర్ కు ప్రయాణం. దారిలో జోషిమఠ్ లో నరసింహస్వామి గుడి, బృధా బద్రీ గుడి, ధారాదేవి గుడి దర్శనాలు. దేవప్రయాగ దగ్గర అలకనంద, భాగీరథీ నదుల సంగమం, ఆ సంగమమే గంగానదిగా ఆవిర్భావం. శ్రీనగర్ కు చేరుకున్నాక, రాత్రికి అక్కడే విశ్రాంతి, బస.
పదకొండవ రోజు : శ్రీనగర్- హరిద్వార్ (150 కి.మీ/4 గం.)
ఉదయం అల్పాహారం తరువాత హోటల్ నుండి హరిద్వార్ ప్రయాణం. దారిలో నీలకంఠ మహాదేవుని గుడి సందర్శనం. హరిద్వార్ లోనే రాత్రికి విశ్రాంతి, బస.
పన్నెండవ రోజు : హరిద్వార్
ఉదయం అల్పాహారం అనంతరం హోటల్ నుండి డెహ్రాడున్ విమానాశ్రయం లేదా హరిద్వార్ రైల్వే స్టేషన్ వారి వారి ప్రయాణమార్గాలను బట్టి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ముఖ్య గమనిక :- పన్నెండు సంవత్సరాలు నిండిన వారు మాత్రమే యాత్రకు అర్హులు
ఆసక్తి గల భాగవతులు తమ పేర్లు నమోదు చేసుకోవలసిన చివరి తేదీ 8-11-2021
బలం గురోః ప్రవర్ధతాం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹