భాద్రపద మాసం వైశిష్ట్యంభాద్రపద మాసం వైశిష్ట్యంfavorite_border

మానవ జీవితంలోని ఒడిదుడుకులను తొలగించి సకలశుభాలను అందించే మాసంగా భాద్రపదమాసం ప్రసిద్ధికెక్కింది. కారణాలను తెలుసుకుందాం.
                             సకలవిఘ్ననివారకుడు, గౌరీపుత్రుడు, విఘ్నేశ్వరుడు ప్రతికల్పంలోనూ భాద్రపదశుద్ధచతుర్థి నాడు ఆవిర్భవిస్తాడు. ఒక కల్పంలో విష్ణువే గణపతిగా పార్వతికి పుత్రుడై వచ్చినట్లుగా బ్రహ్మవైవర్తపురాణంలో ఉంది.ఈ కల్పంలో అనగా శ్వేతవరాహకల్పంలో మాత్రం  పార్వతీ దేవి శరీరమలం నుండి ఆవిర్భవించాడు.
                శ్లో||  విచార్యేతిచ  సాదేవీ వపుషో మల సంభవమ్ | 
                       పురుషం నిర్మమౌసాతు సర్వలక్షణ సంయుతమ్|
                         (శివపురాణం, కుమారఖండం గణేశోత్పత్తి - 13వ అధ్యాయం 20 శ్లోకం)
                        పార్వతీదేవి శరీరం దివ్యశరీరం. అయినా ఆ తల్లి కావాలని పాంచభౌతిక శరీరానికి కలిగే లక్షణాలను తన శరీరానికి కల్పించుకోవడంతో, ఆమె శరీరం నుండి మట్టి పుట్టింది. అందులో నుండి గణపతి పుట్టాడు. ఎందుకో గాని, కొందరు వ్యాఖ్యాతలు  వపుషః + మలసంభవం, పురుషం అన్నదానికి నలుగుపిండి నుండి పుట్టినట్లు వ్యాఖ్యానాలు వ్రాసారు. కానీ కంచి పరమాచార్యులు మాత్రం శరీరపుచెమట నుండి పుట్టిన మట్టి నుండి గణపతి జన్మించినట్లు వివరించారు. నిజానికిక్కడ పిండి ప్రసక్తి లేనేలేదు. అలా పుట్టిన పార్వతీపుత్రుని శిరస్సును శివుడు ఖండించి గజముఖం ప్రసాదించడంతో శ్రీగణేశుడు గజముఖుడు అయ్యాడు. సర్వవిఘ్ననివారకుని జన్మకు కారణమైన భాద్రపదం భద్రపదమే. గణేశుని పూజించి జనులు సకలశుభాలనూ పొందగలరని నారదపురాణంలోని 113వ అధ్యాయంలో ఉన్నది.
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల ప్రవచనములు మరియు కవయిత్రి శ్రీవిద్య గారు మనకందించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సందేశం)
expand_less