12th Sathaavadhanam was a triumph12 వ శతావధానం దిగ్విజయంగా పూర్తయినదిfavorite_bordershare
శ్రీ గురుభ్యోనమఃఅవధాన కోకిల , సరస్వతీ పుత్ర, ధారణాచిత్రగుప్త, ధారణావేదావధాననిధి , త్రిభాషామహాసహస్రావధాని, ప్రణవపీఠాధిపతి, మన పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 12 వ శతావధానం దిగ్విజయంగా పూర్తయినది.
తేదీ - 12,13,14 నవంబర్ 2021
వేదిక - కోనసీమ ద్రావిడ సంఘం, చిక్కడపల్లి, హైదరాబాద్.
శుభోదయం గ్రూప్ వారి సౌజన్యంతో జరిగిన ఈ శతావధానం లో పృచ్ఛకులు గా వచ్చిన వారిలో ఎందరో సాహితీవేత్తలు, అష్టావధానులు, శతావధానులు , సహస్రావధానులతో సహా ఎందరో సుప్రసిద్ధ కవులు, తెలుగు భాషాభిమానులు పాల్గొనటం విశేషం.
ఒక్కొక్క సమస్యకు పద్యంతో సమాధాన పరిచిన వెంటనే సభలోని ప్రతి ఒక్కరూ ఆహా, ఓహో అని మెచ్చుకోవటంతో పాటు చప్పట్లతో సభ మారుమ్రోగింది. 3 రోజుల అవధానంలో మొదటి రోజులోనే 83 అంశాలను స్పృశించి, రెండవ రోజు సాయంత్రం లోపే 25 సమస్యలను, 25 దత్తపదులను, 25 వర్ణనాంశాలను మరియు 25 పద్యాలను ఆశువు గా పూర్తి చేసారు.
డా౹౹ ధూళిపాళ మహాదేవమణి గారు సంచాలకత్వం వహించగా,ముఖ్య అతిథులు గా తెలుగు భాషాసేవకులు, ప్రముఖ నటులు శ్రీ తనికెళ్ళ భరణి గారు, గిడుగు రామ్మూర్తి గారి ముని మనుమరాలు, దర్శనమ్ ఆధ్యాత్మిక పత్రిక స్థాపించిన శర్మ గారు, కొప్పరపు కవుల కళాపీఠం వ్యవస్థాపకులు మాచవరం వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయశర్మ గారు (మా శర్మ గారు), స్వర నిధి వ్యవస్థాపకులు వీణాపాణి గారు ఇంకా ఎందరో మహానుభావులు విచ్చేసి శ్రీ గురుదేవుల ఆమోఘమైన పాండిత్యం చూసి అనేక విధములుగా కొనియాడారు.
గురుదేవుల యొక్క ఈ శతావధానం ను కొప్పరపు కవులకు అంకితం ఇచ్చిన సందర్భంగా మా శర్మ గారు తరువాతి సంవత్సరం లో అనగా 2022వ సంవత్సరం కొప్పరపు కవుల కళాపీఠం తరపున ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డును గురుదేవులకి సమర్పించాలని సంకల్పం చేసామని శుభవార్త తెలియచేసారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన శుభోదయం గ్రూప్ యాజమాన్యం శ్రీ లక్ష్మీప్రసాద్ గారు, శ్రీ సూర్యప్రకాష్ గారు తదితరులు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు శ్రీ ప్రణవపీఠంతో మమేకమై చేయటానికి ఎప్పటికీ సిద్ధం అని వారి అభిమానాన్ని చాటుకున్నారు.
గురుదేవులు 3వ రోజున కేవలం 35 నిమిషాలలో 75 పద్యముల ధారణ పూర్తిచేసి రికార్డులు తిరుగరాసారు. సంచాలకత్వం వహించిన మహాదేవమణి గారు ఎన్నో సార్లు గురుదేవుల పాండిత్యాన్ని పొగుడుతూ ఎంతో సంతోషించారు. వేదం, పాండిత్యం, వ్యాకరణం , జ్యోతిష్యం, సంగీతం, అష్టాదశ పురాణములను, భాగవతమును పూర్తిగా తెలిసిన వారే ఈ రీతిలో అవధానం చేయగలరని సభాముఖంగా స్పష్టం చేసారు. పృచ్ఛకులు గురుదేవుల పద్యాలు రాసుకోలేని వేగంతో, అలౌకిక ఆనందం కలిగించే శైలితో, రమణీయ వర్ణనతో, ఇతిహాస శాస్త్ర అంతరార్థములతో, విశేష పదప్రయోగములతో నిండి ఉన్నాయని ఆనందించారు. ఇత్యాది విషయాల సారమును తెలుసుకొన్న ప్రతి ఒక్కరూ పూర్తిగా సంతృప్తి చెంది, మొత్తం సభ 5 సార్లకు పైగా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో తమ ఆమోదం తెలియచేసారు.
విజయోత్సవ సభలో గురుదేవులను సత్కరించుకున్న పిమ్మట నిర్వాహకులను, పృచ్ఛకులను, ముఖ్య అతిథులను, స్వయం సేవకులను, ఇంకా ప్రత్యక్షముగా, పరోక్షంగా సేవలందించిన అందరినీ గౌరవ మర్యాదలతో సత్కరించారు. గురుదేవులు అందరికీ శుభం కలగాలని, ఇంకా ఎందరో యువ అవధానులు బయటికి రావాలని ఆకాంక్షిస్తూ, ప్రతి ఒక్కరికీ శుభాశీస్సులు అందించటంతో ఈ 3 రోజుల కార్యక్రమం మహాద్భుతంగా పూర్తయినది.
https://www.facebook.com/groups/128389840744/permalink/10159521349825745/?mibextid=S66gvFశుభం
బలం గురోః ప్రవర్ధతాం
సమస్త లోకాః సుఖినోభావంతు