Description
నమాతుః పరదైవతమ్
తల్లిని మించిన దైవం లేదు
నిజమునకు దైవానికి గుణ రూప కర్మాదులు లేవు. లోకరక్షణ కోసం, పరమాత్ముడు రూపంతో దర్శనం ప్రసాదిస్తాడు. ఆయా రూపాలలో అమ్మవారి రూపానికి మించిన రూపం మరొకటి కనపడదు. తక్కిన దేవతా రూపాలు, మంచికి మంచినీ, చెడునకు చెడునూ ప్రసాదిస్తాయి. కానీ శ్రీమాత మాత్రం ఎంతటి నీచుడినైనా బాగు చేసి, కటాక్షిస్తుంది. అందుకే అమ్మను “అవ్యాజకరుణామూర్తి “ అని పిలుస్తారు.
ఒక దేవాలయంలో ఒక పిల్లి ఎలుకను తరిమింది. ఎలుక భయంతో, ఆత్మరక్షణ కోసం గుడి చుట్టూ పరుగులు తీసింది. ఆ పరుగు ప్రాణరక్షణ కోసమైనా తన చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా భావించి, అమ్మవారు ఎలుకకు స్వర్గం ప్రసాదించింది. ఇది అమ్మవారి స్వభావమంటే.
భయంతోనైనా, భక్తితోనైనా, ప్రీతితోనైనా, భీతితోనైనా, ఏ వంకతోనైనా, తన దర్శనం చేసుకొన్న వారిని తనను తలుచుకొన్న వారిని రక్షించే స్వభావం శ్రీ మాతది. అందుకే నాకా తల్లిపై అపార భక్తి విశ్వాసాలు.
ఇది కలియుగం. ప్రతి జీవికి ఏదో ఒక కష్టం. ఎవ్వరికీ సమయం చాలదు. పూర్వం లాగా పూజలు చేయలేరు. గట్టిగా ప్రదక్షిణలు చేయలేరు. డబ్బు ఖర్చు పెట్టలేరు. ఉపవాసాలు సరేసరి. ఎవ్వరిని చూసినా మనోధైర్యం లేనివారే. మరి ఈ జీవులను ఎలా రక్షించాలి? వీరికి దిక్కెవరు? అని నేనొక రోజంతా అమ్మను ధ్యానించాను. అమ్మ దర్శనం ఇచ్చింది. శ్రీలలితాసహస్రనామస్తోత్రంలోని ప్రతి నామానికి తేట తెలుగులో వివరణ ఇచ్చి, ఏ నామాన్ని ఎంత, ఎలా జపిస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయో లోకానికి అందించమని చిరునవ్వు ముఖముతో ఆజ్ఞాపించింది.
అమ్మవారి అనుగ్రహంతో నామవ్యాఖ్యామంత్రప్రయోగవిశేషాలు విరచించడం మొదలు పెట్టాను. ప్రస్తుతానికి కొన్ని నామాలు భక్తులకు అందించగలుగుతున్నాను. శీఘ్రకాలంలో సహస్ర నామాలకూ వ్యాఖ్యామంత్రప్రయోగవిశేషాలు లోకప్రకటితాలు కావాలని కోరుకొందాం. వీటిని జపిస్తే సంపదలు, ముక్తి లభిస్తాయి. కనీసం వీటిని చదివినా, సకలసౌఖ్యాలు లభిస్తాయి. బ్రహ్మాండపురాణంలో ఈ సహస్ర నామాలు ఉన్నాయని అంటాం కానీ ఈ నామాలలోనే భువన బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. వీటి మాధుర్యం, మహిమ నేను నిత్యం అనుభవిస్తూనే ఉన్నాను. ఇంకెందుకాలస్యం మీరంతా కూడా వీటిలో ఓలలాడండి, తరించండి.
ఈ నామ మంత్రాలను లోకానికి అందించడానికి భక్తితో శ్రమించిన శిష్యులకు అనేక మంగళాశాసనాలు. వీరందరికీ గురుకటాక్షం, గురుమూర్తి అయిన అమ్మవారి కటాక్షం నిరంతరం లభించుగాక!
Reviews
There are no reviews yet.