Avadhanamuluఅవధానములు

తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి ఎందరో మహానుభావులు, భాషాభిమానులు మాతృభాషా వైభవాన్ని పెంపొందించడానికి చేసిన కృషి వెలకట్టలేనిది. మాతృభాషా మాధుర్యం మాటలలో వర్ణించలేనిది.

ఆంధ్రభోజుడిగా, సాహితీసమరాంగణ సార్వభౌముడిగా కీర్తిగాంచిన  శ్రీకృష్ణదేవరాయలు తమ ఆస్థాన భువనవిజయంలో అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు వంటి అష్టదిగ్గజములనే కాక ఎంతోమంది కవులను పోషించి తెలుగుభాషకు ఎనలేని సేవ చేసారు. అలాగే తెలుగుభాషకు పట్టంకట్టిన ఎందరో మహానుభావులైన కవులు, అవధానులు తిరుగాడిన, తిరుగాడుతున్న తపోభూమి మన తెలుగునేల. అటువంటి వారిలో ప్రముఖులు ఆంధ్రభాషాభూషణ బిరుదాంకితులు, సరస్వతీ పుత్రులు, కారణజన్ములు, తపోనిష్ఠులు, సద్గురువులు త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. జన్మతః  శారదావరప్రసాది, పాండితీవచోనిధి అయిన సద్గురువులు, తమ సాధనతో, శోధనతో తెలుగు, సంస్కృ తం, హిందీ భాషలలో అనంతప్రావీణ్యాన్ని, అశేషపాండిత్యాన్ని సంతరించుకొన్న సరస్వతీపుత్రులు.  తెలుగు, సంస్కృత, హిందీ భాషలలో వారి ప్రావీణ్యం అద్వితీయం.

తమ ప్రవచనాలతో మహోన్నతమైన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, పురాణేతిహాసాలను గురించి సదవగాహన కల్గిస్తూ ఆధ్యాత్మిక పరిమళాలను గుబాళింపజేస్తూ, వేలాదిగా అష్టావధానాలు, శతావధానాలు, ద్విశతావధానాలు, సహస్రావధానాలు చేస్తూ దేశవిదేశాలలోని సాహితీప్రియులను అలరిస్తున్న సాహితీ అధ్యాత్మిక శిఖరం శ్రీప్రణవపీఠాధీశులు, త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు.

1992 వ సంవత్సరం డిసెంబర్ లో మొదలైన వారి అవధానప్రస్థానం నేటికీ  అప్రతిహతంగా, అద్వితీయంగా సాగుతూనే ఉన్నది. 2022 మే 29వ తేదీ నాటికి 1246 అష్టావధానాలు, 12 శతావధానములు, 8 జంట అవధానములు మరియు 1 త్రిభాషామహాస్రావధానముతో భావితరాలకు మార్గదర్శి ,స్ఫూర్తిప్రదాత అయ్యారు. అవధానాల పరంపర ద్వారా వారు చేస్తున్న భాషాసేవ అనంతం. సహస్రావధానం, ద్విశతావధానం మనకు తెలుసు. కానీ అష్టావధానలే సహస్రం‌ పైన ఒక ద్విశతము కన్నా ఎక్కువ చేసిన అఖండ ప్రజ్ఞా పాండితీ విలాసం మనం‌ కనీవినీ ఎరుగము.

శారదాపుత్రులైన వీరు 2000 సంవత్సరంలో “నభూతో నభవిష్యతి” అనే విధంగా కనీవినీ ఎరుగని రీతిలో సంస్కృతం, తెలుగు, హిందీ భాషల్లో “త్రిభాషామహాసహస్రావధానం చేసి చరిత్ర సృష్టించారు.

కరోనా మహమ్మారి కూడా వారి అమోఘ సంకల్పానికి, అకుంఠితదీక్షకు అడ్డుకట్ట వేయలేకపోయింది. 2021 ఏప్రిల్ నాటికి 1230 అష్టావధానాలు చేసిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు వినూత్నరీతిలో తమ సాహితీసేవలో భాగంగా మాతృభాషయైన తెలుగుభాషను దశ దిశలా, ప్రపంచం నలుమూలలా మరింత విస్తృతం చేయడానికి సంకల్పించారు.  

తమ విశేష సాహితీప్రతిభతో సహస్రాధిక్య అవధానాలు చేసిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు తెలుగు సాహితీప్రక్రియలలో మకుటాయమానమైన “అవధాన విద్య” ను సప్త ఖండాలలో పరిఢవిల్లవింపచేసే దృఢ నిశ్చయంతో “సప్త ఖండ అవధాన సాహితీ ఝరి” అనే అపూర్వ సాహితీ మాస శీర్షిక కి 2021 వ సంవత్సరం ఉగాదినాడు శ్రీకారం చుట్టారు.  ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశం ప్రపంచం నలుమూలలా ఖండాంతరాలలో ఉన్న తెలుగు భాషాభిమానులను, సాహితీ ప్రియులను శోధించి, పృచ్ఛకులుగా ప్రోత్సహించి తీర్చిదిద్ది,  అవసరమయిన శిక్షణను కూడా ఇప్పించి అంతర్జాతీయంగా అంతర్జాల మాధ్యమం ద్వారా అవధాన యజ్ఞంలో భాగస్వామ్యం చేయడం. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, భారతదేశం, యావత్ ప్రపంచం ఒకే వేదికపై వచ్చేలా, ఆంధ్ర భాషావైభవాన్ని, అవధానవైశిష్ట్యాన్ని ఖండాంతరాలలో విస్తరింపజేయడం.  

ఈ అవధానయజ్ఞంలో భాగంగా అంతకుముందు పృచ్ఛకులుగా అనుభవం ఉన్న ప్రముఖ సాహితీప్రియులనే కాకుండా, అనుభవం లేని కొత్తవారిని సాహితీ అభిమానులను ఎంపిక చేసి వారికి శిక్షణను ఇప్పించి వారితో అవధాన యజ్ఞాన్ని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు చెయ్యడం జరిగింది. వారి శిష్యులైన ప్రముఖ ఆస్ట్రేలియా అవధాని “అవధాన శారదామూర్తి” శ్రీ తటవర్తి శ్రీ కల్యాణ చక్రవర్తి గారు శిక్షణను ఇవ్వడంలో ప్రధాన భూమిక పోషిస్తూ, పృచ్ఛకులకు కావలసిన శిక్షణ ఇస్తూ, దాదాపుగా 10 అష్టావధానాలలో తాము సంచాలకత్వం కూడా చేసారు. అలాగే “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా” నివాసి అయిన శ్రీ రామచంద్రరావు తల్లాప్రగడ గారు ఇందులో 10 కి పైగా అష్టావధానాలలో “నిషిద్దాక్షరి” అంశం ను నిర్వహించడమే కాకుండా పృచ్ఛకులకు అవసరమయిన సూచనలను, సలహాలను అందించారు.

భారతదేశానికి తూర్పున ఉన్న ఆస్ట్రేలియా ఖండం లో భాగం గా ఆస్ట్రేలియా దేశం లో నివసిస్తున్న ప్రవాస భారతీయులతో ఈ శీర్షిక కి మే నెల 29 వ తేదీ 2021 వ సంవత్సరంలో అంకురార్పణ జరిగింది. ఆస్ట్రేలియా ఖండంలో గల ఆస్ట్రేలియా దేశం తెలుగు భాషని తమ సామాజిక భాషగా గుర్తించిన మొట్టమొదటి పరదేశం. ఇది అక్కడి ప్రభుత్వం యొక్క పరభాషా ఆదరాన్ని, అక్కడి ప్రవాసుల భాషాభిమానాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ అవధాన యజ్ఞంలో భాగంగా 8 మంది పృచ్ఛకులు పాల్గొనగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఈ శీర్షికలో తమ

 • మొదటి అవధానాన్ని, తమ 1231వ అష్టావధానాన్ని దిగ్విజయంగా అతి వేగంగా గంటన్నర లోపలే సంపూర్ణం చేసారు. 
 • 2021 వ సంవత్సరం జూన్ నెల 26వ తేదీన “ఆస్ట్రేలియా” ఖండంలో రెండవ దేశమైన న్యూజిలాండ్ దేశ పృచ్ఛకులతో 1232వ అష్టావధానం.
 • ఆఫ్రికా ఖండంలో భాగంగా దక్షిణ ఆఫ్రికా వారితో జూలై నెల 31వ తేదీన 1233వ అష్టావధానం. 
 • యూరోప్, అంటార్కిటికా ఖండాలలో భాగంగా యునైటెడ్ కింగ్డమ్ పృచ్ఛకులతో ఆగస్ట్ 29వ తేదీన 1234వ అష్టావధానం.
 • “ఆసియా” ఖండం నుండి భారతదేశ పృచ్ఛకులతో సెప్టెంబర్ 11వ తేదీన 1235వ అష్టావధానం.
 • మిగిలిన యూరోప్ దేశాలైన స్కాట్లాండ్, జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్, నార్వే మొదలైన దేశాల పృచ్ఛకులతో అక్టోబర్ 2వ తేదీన 1236వ అష్టావధానం.
 • మలేషియా దేశ మహిళా పృచ్ఛకురాండ్రతో నవంబర్ 6వ తేదీన 1237వ అష్టావధానం.
 • మధ్యప్రాచ్య ప్రాంతమునుండి గల్ఫ్ దేశమైన ఖతార్ వారితో డిసెంబర్ 31వ తేదీన 1238వ అష్టావధానం.
 • ఇక నూతన సంవత్సరం 2022 లో “ఉత్తర అమెరికా” ఖండంలో అమెరికా దేశపృచ్ఛకులతో జనవరి 15వ తేదీన 1239వ అష్టావధానం, అదే రోజున సాయంత్రం “ఆసియా” ఖండం లో భాగంగా సింగపూర్ దేశపృచ్ఛకులతో జరిగిన 1240వ అష్టావధానం.
 • ఖతార్, కువైట్, బహరైన్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ పృచ్ఛకులతో 2022 వ సంవత్సరం మార్చి 4వ తేదీన 1241వ తేదీన జరిగిన అష్టావధానం.
 • కెనడా దేశం నుండి 8 మంది మహిళా పృచ్ఛకురాండ్రు పాల్గొనగా, ఏడవ ఖండమైన “దక్షిణ అమెరికా” నుండి ప్రత్యేక పృచ్ఛకులు ఆశువు అంశం నిర్వహించడంతో 2022 ఏప్రిల్ 3వ తేదీన జరిగిన 1242వ అష్టావధానంతో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు “ఏడు ఖండాల వారితో అవధాన సాహితీ ఝరి చేసిన సార్వభౌముడిగా ఖ్యాతి గడించారు.  బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అనన్యసామాన్యమయిన ఆశువేగం,ధారా శుద్ధి, ధారణా పటిమ, వారు చేసిన సాహితీ విన్యాసం ప్రపంచ సాహితీవేత్తలను విస్మయపరచింది.
 • మే నెల 2022 సంవత్సరంలో ఉత్తర, దక్షిణ అమెరికా పృచ్ఛకులతో చేసిన 1243వ, 1244వ అష్టావధానాలతో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి మనస్సంకల్ప జనితమైన సప్త ఖండ అవధాన సాహితీ ఝరి దిగ్విజయంగా విజయదుందుభి మ్రోగించింది. 

ఈ శీర్షికలో ఎందరో పీఠాధిపతులు, గురువులు పాల్గొని తమ ఆశీర్వాదపూర్వక దివ్యమంగళాశాసనాలను అందించారు. అలాగే సినీసాహితీప్రముఖలు, రాజకీయవేత్తలు, పత్రికా సంపాదకులు అద్భుత ప్రసంగాలు అందించారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అమోఘ సంకల్పానికి, ఈ వినూత్న ప్రయత్నానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రశంసల జల్లులు కురిసాయి.  ఈ శీర్షికలో మరొక ఆసక్తికరమైన విషయం, రెండు ఖండాలలో జరిగిన అష్టావధానాలలో స్త్రీ మూర్తులే పృచ్ఛకురాండ్రు అవడం. 

అవధానసాహితీచరిత్రలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో ప్రప్రథమంగా సప్త ఖండాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులతో అవధానాలు చేసిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు తెలుగుసాహితీసేవలో తిరుగులేని చరిత్ర సృష్టించారు. ఈ శీర్షిక తెలుగు సాహితీచరిత్రలో ప్రపంచంలోని అన్ని ఖండాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయ పృచ్ఛకులను భాగస్వాములనుచేసి, అవధానం చేసిన మొట్టమొదటి కార్యక్రమంగా ఈ అసాధారణమైన ప్రతిభని  “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్”,  “వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్” , “జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్” , “తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు గుర్తించాయి.

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు వారి సంస్థనుండి గుర్తించడంతో పాటుగా, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి సన్మానం చేయటానికి న్యూఢిల్లీ కి ఆహ్వానం, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సమ్మతి ఈ శీర్షికకి లభించింది.

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు శ్రీ బింగి నరేంద్ర గౌడ్ గారు; జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు, డాక్టర్ ఎం.విజయలక్ష్మి మురుసుపల్లి గారు; తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుండి చీఫ్ అడ్వైజర్ డా. సాయి శ్రీ గారు, ఏలూరు జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్ డా. శివశంకర్ గారు మొదలైన ప్రతినిధులు నేరుగా శ్రీ ప్రణవపీఠానికి విచ్చేసి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి సర్టిఫికెట్, మెడల్ అందజేసి సత్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రసార మాధ్యమాలు, ప్రముఖ వార్తా పత్రికలు ఈ వార్తను ప్రసారం చేసాయి.

ఎన్నో సంస్థలు తమని భాగస్వామ్యం చేసినందుకు త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిని ప్రశంసల జల్లులతో ముంచెత్తాయి. ప్రపంచ తెలుగు సంఘాల నుండి ప్రశంసా పత్రాలు వెల్లువలా కురిసాయి.  అన్ని సంఘాలవారు ముక్తకంఠంతో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి “ సప్త ఖండ అవధాన సార్వభౌమ” అనే బిరుదును మే 29 వ తేదీన అంతర్జాల విజయోత్సవ సభలో భక్తిపూర్వకంగా సమర్పించుకున్నారు.

ఈ అంతర్జాల అవధాన యజ్ఞంలో భాగంగా వివిధ దేశాలలో ఉన్న తెలుగు సాహితీ ప్రియులను ప్రోత్సహిస్తూ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు చేసిన ఈ శీర్షిక ఒక గొప్ప సాహితీ మహాక్రతువుతో సమానం. ఈ శీర్షిక ఏనాడైతే (మే29, 2021 వసంవత్సరం) మొదలైందో మళ్ళీ అదే తేదీన (మే 29, 2022 వ సంవత్సరం) దిగ్విజయంగా సంపూర్ణమవడం భగవంతుని లీల. మహాసరస్వతి, తెలుగుతల్లి యొక్క అపారకృపకు, భగవత్సంకల్పానికి తార్కాణం.  

ప్రవచనాలలోనే కాక పద్యరత్నాలలో అన్ని ధర్మశాస్త్రాలు,  వేదాంతశాస్త్రాలు,  మీమాంసలు ఉండేలా అందమైన అక్షరాలకూర్పుతో, భగవత్ తత్వాన్ని కూడా నేర్పుతో శ్రోతలకు సులువుగా అర్థమయ్యేలా అందిస్తూ , అలరింపజేస్తున్న గురుదేవులు 2022వ సంవత్సరం జూన్ నెలలో తమ అమెరికా పర్యటనలో భాగమా “ఆటా” వారి ప్రపంచ మహసభలలోను, మరియు “సిలికానాంధ్ర” వారి కార్యక్రమములలోను మరొక 2 అష్టావధానాలను చేసారు. గురుదేవులకు “సిలికానాంధ్ర అవధానభారతి” అన్న బిరుదు కూడా సిలికానాంధ్ర సంస్థవారు భక్తిపూర్వకంగా సమర్పించుకొన్నారు.

వివిధ ప్రసారమాధ్యమాలు, పత్రికా ప్రచురణలు తెలుగు భాషకి అత్యున్నత వైభవం “సప్త ఖండ” అవధానం

అంతర్జాతీయ ప్రపంచ రికార్డ్స్ సంస్థలు సమర్పించిన ధృవపత్రాలు

అంగరంగంగా సప్త ఖండ అవధాన సాహితీ ఝరి విజయోత్సవ సభ

expand_less